ఋగ్వేదం 5.31.2
నహి త్వదిన్ద్ర వస్యో అన్యదస్త్యమేనాఁశ్చిజ్జనివతశ్చకర్థ
ఇంద్రా! అవివాహిత (యువకుడికి) భార్య లభించేటట్లు నీవు చేయగలవు.
--'
ఇక్కడ అమేన అంటే భార్య లేనివారు/అవివాహితుడు అని, జనీవత్ అంటే వివాహితుడు అని అర్థము ఉంది.
--'
ఇటువంటి ప్రయోగమే, ఇంకొక విధంగా ఋగ్వేదంలో (ఋగ్వేదం 7.96.4) కనిపిస్తుంది. గమనించగలరు.
జనీయన్తో న్వగ్రవః పుత్రీయన్తః సుదానవః । సరస్వన్తం హవామహే ॥
అవివాహితులైన మేము, భార్య, పిల్లల కోసం సరస్వంతుని ప్రార్థిస్తున్నాము.
--
న్వగ్రవః - ను + అగ్రవ:
ఇక్కడ అగ్రు - అంటే భార్య లేనివారు/అవివాహితుడు అని అర్థం.
--
ఒక పురుషుడు, స్త్రీని పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు?
ధర్మబద్ధంగా భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం, పిల్లలను పొందడం కోసం, తద్వారా జన్మ తీసుకున్నందుకు కర్మలను అనుభవించడం కోసం.
తైత్తరీయ ఉపనిషత్ 1.11.1 కూడా, సత్యాన్ని అనుసరించమని, ధర్మాన్ని పాటించమని, వంశం నశింపచేయకుండా చూడమని (అంటే సంతానం పొందమని) చెబుతోంది.
సత్యం వద । ధర్మం చర । .....ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీః
---
నాకు కలిగిన సందేహం ఏమిటంటే, ఈ ఋగ్వేదంలోని ఋక్కులు కూర్చినవారు ఋషులు. వారు పెళ్లి కాక (లేక) భార్య మరణించడం వల్ల ఈ విధంగా కోరారా (లేక) వేరే ఇంకొకరి తరఫున ఈ విధంగా కోరారా (లేక) *అమేన, అగ్రు,జనీవత్* అనే పదాలకు, తరువాతి తరంవారు మరచిన/తెలియని వేరే అర్థాలు ఉన్నాయా?
---
బాగా ఆలోచిస్తే, *అమేన, అగ్రు,జనీవత్* అనే పదాలకు, తరువాతి తరంవారు మరచిన/తెలియని వేరే అర్థాలు ఉండి ఉండాలి, అనిపిస్తోంది.
భార్య ఒక తేజస్సు. అంటే అగ్ని అనుకోవచ్చును.
పురుషుడు, భార్య ద్వారా పిల్లలను ఎలా పొందుతాడో, తద్వారా కర్మలను ఎలా అనుభవిస్తాడో, అలాగే యజ్ఞం ద్వారా, దేవతల అనుగ్రహంతో యజ్ఞఫలం పొందుతారు.
యజ్ఞం కూడా 2 రకాలు.
1) మంత్రాలు చదువుతూ, నెయ్యి వేస్తూ, సక్రమమైన రీతిలో చేసే భౌతిక యజ్ఞం - యజుర్వేద విధానం
2) గురువు చెప్పిన పద్ధతిలో చేసే మానసిక తపస్సు లేదా యజ్ఞం - శాశ్వతమైన ఆనందం పొందడం లక్ష్యం - ఋగ్వేద విధానం.
---
తపస్సు లేనివాడిని అవివాహితుడు అని సంకేతార్థం తీసుకోవచ్చును.
తపస్సు చేసేవాడిని వివాహితుడు అని సంకేతార్థం తీసుకోవచ్చును.
అంటే నాకు తపస్సు ప్రసాదించి, శాశ్వతమైన ఆనందం పొందేటట్లు చేయమని చేసే ప్రార్థనగా నాకు అనిపిస్తోంది.
No comments:
Post a Comment