Friday, 14 February 2025

ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారికి శునఃశెప ఆజీగర్తి ఋషి చూపించిన దారి

 

ఋగ్వేదం 1.24.2


అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ । 

స నో మహ్యా అదితయే పునర్దాత్పితరం చ దృశేయం మాతరం చ ॥


మరణమే లేని వారిలో మొదటివాడైన అగ్ని దేవుడి యొక్క ప్రియమైన పేరును మనం మననం చేద్దాము. అతను మనల్ని (ఆద్యంతాలులేని) అదితికి తిరిగి ఇస్తాడు. (అప్పుడు) మనం మన తండ్రిని మరియు తల్లిని చూస్తాము.


--

సాధన చేసి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారికి శునఃశెప ఆజీగర్తి ఋషి చూపించిన దారి.


ఇందులో సూచన 3 భాగాలుగా ఉంటుంది.


1. అగ్ని దేవుడి యొక్క ప్రియమైన పేరును మననం చేయడం

2. అలా మననం చేసిన వారిని, అగ్ని ఆద్యంతాలులేని అదితికి తిరిగి అప్పగించడం.

3. (అప్పుడు) మనం మన తండ్రిని మరియు తల్లిని చూడడం

---

దేవతలను భౌతిక రూపాలలో ఊహించుకుంటే, ఈ ఋగ్వేద ఋక్కు అర్థం పట్టుబడదు, అని నాకనిపిస్తోంది.  సంకేతార్థంతోనే ఇది అర్థమవుతుంది.

--

భూ, అంతరిక్ష, స్వర్గాలలో అగ్ని, ఇంద్రుడు/వాయువు, సూర్యుడుగా వ్యాపించిన శక్తియే అగ్ని, పరబ్రహ్మకు పురుష నామం అనుకోవచ్చును.


అదితి - అంటే విభజన లేనిది- అంటే ఆద్యంతాలు లేనిది, దేనికి బంధింపబడనిది, తనను ప్రార్థించినవారి బాధలను తొలగించేది - పరబ్రహ్మకు స్త్రీ నామం అనుకోవచ్చును.

---

పరబ్రహ్మ పురుష నామమైన అగ్ని పేరును స్మరిస్తూ ఉంటే, ఆద్యంతాలు లేని  పరబ్రహ్మ స్త్రీ శక్తి అదితిని చేరుతాము.  స్త్రీ,పురుష శక్తుల సంయోగం అనుభవంలోకి వస్తుంది, అని అర్థం తీసుకోవచ్చును.


ఐతే సమస్యంతా, నామమే లేని పరబ్రహ్మ యొక్క ఏ నామం మననం చేయాలనే?  ఈ విషయంలో కూడా సంకేతార్థం తీసుకోవాలనిపిస్తోంది.


--


ఋగ్వేదం ప్రారంభ ఋక్కు అగ్నిని అందరికన్నా మొదట ఉద్భవించినవాడు, ఋతం/సత్యంలో రమించేవాడు/ఆనందించేవాడు అని కీర్తిస్తోంది.


అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ । హోతారం రత్నధాతమమ్ ॥

---

ఋత్విజమ్ - ఋతం/సత్యంలో రమించేవాడు/ఆనందించేవాడు.  అంటే పరబ్రహ్మకు ప్రియమైనది సత్యవంతమైన జీవనం అని అర్థం వస్తోంది. 


అంటే సత్యవంతమైన జీవనం గడిపేవారు, అదితిని చేరుతారు.

 

 

No comments:

Post a Comment