ఋగ్వేదంలో అదితిని దేవమాత అన్నారు. వరుణుడు, మిత్ర, అర్యమన్,దక్ష, అంశ మరియు భగుడు అనే ఆరు మంది ఆదిత్యులకు తల్లిగా చెప్పారు (2.27.1). సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్త్రీ శక్తిగా వర్ణించారు.
పురాణాలలో లలితాత్రిపురసుందరీ/రాజరాజేశ్వరీ అని ఏ శక్తిని వర్ణించారో, అదే శక్తిని ఋగ్వేదంలో అదితిగా కీర్తించారు.
ఆ అదితికి సంబంధించిన ఋక్కులు/మంత్రాలు/శ్లోకాలు అన్ని ఋగ్వేదంలో ఒకేచోట లేవు. అనేక మండలాలలో విస్తరించి ఉన్నాయి.
సరస్వతికి, ఇంద్రుడికి, అగ్నికి, బృహస్పతికి, రుద్రునికి, ఇలా అందరు దేవతలకు సూక్తాలు ఉన్నాయి. ఋగ్వేదంలో మాత్రము సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్త్రీ శక్తిగా కీర్తించబడిన అదితికి ఒక్క సూక్తం కూడా లేదు.
అందువలన, ఋగ్వేదంలో అనేక మండలాలలో విస్తరించి ఉన్న అదితికి సంబంధించిన ఋక్కులు/మంత్రాలు/శ్లోకాలను ఒకచోట చేర్చి, ఒక సూక్తం తయారు చేయాలనిపించి ప్రయత్నించాను.
పరబ్రహ్మార్పణమస్తు!
ఋగ్వేదం 1.24.2
ఋషి/ద్రష్ట : శునఃశెప ఆజీగర్తి
అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ ।
స నో మహ్యా అదితయే పునర్దాత్పితరం చ దృశేయం మాతరం చ ॥
పదపాఠము
అగ్నేః । వయమ్ । ప్రథమస్య । అమృతానామ్ । మనామహే । చారు । దేవస్య । నామ । సః । నః । మహ్యై । అదితయే । పునః । దాత్ । పితరమ్ । చ । దృశేయమ్ । మాతరమ్ । చ ॥
అర్థము
మరణమే లేని వారిలో మొదటివాడైన అగ్ని దేవుడి యొక్క ప్రియమైన పేరును మనం మననం చేద్దాము. అతను మనల్ని (ఆద్యంతాలులేని) అదితికి తిరిగి ఇస్తాడు. (అప్పుడు) మనం మన తండ్రిని మరియు తల్లిని చూస్తాము.
(ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే సాధకులకు నర్మగర్భంగా ఇచ్చిన సందేశమీ ఋక్కు. వివరాలను ఈ లింకులో చూడగలరు.
ఋగ్వేదం 1.89.10
ఋషి/ద్రష్ట : గొతమ రాహూగణ
అదితిర్ద్యౌరదితిరన్తరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః ।
విశ్వే దేవా అదితిః పఞ్చ జనా అదితిర్జాతమదితిర్జనిత్వమ్ ॥
పదపాఠము
అదితిః । ద్యౌః । అదితిః । అన్తరిక్షమ్ । అదితిః । మాతా । సః । పితా । సః । పుత్రః । విశ్వే । దేవాః । అదితిః । పఞ్చ । జనాః । అదితిః । జాతమ్ । అదితిః । జనిత్వమ్ ॥
అర్థము
“అదితి స్వర్గం. అదితియే మధ్య నున్న అంతరిక్షం . అదితి తల్లి; ఆమెయే తండ్రి, ఆమెయే కుమారుడు. అదితియే సమస్త దేవతలు, ఐదు రకాల ఇంద్రియాలు - చూపు, వినికిడి శక్తి, వాక్కు, మనస్సు, జీవం - (పఞ్చ జనా:). పుట్టిన ప్రతీది అదితి, పుట్టబోయేది అదితియే.”
ఋగ్వేదం 8.18.4
ఋషి/ద్రష్ట : ఇరిమ్బిఠి కాణ్వ
దే॒వేభి॑ర్దేవ్యది॒తేఽరి॑ష్టభర్మ॒న్నా గ॑హి । స్మత్సూ॒రిభి॑: పురుప్రియే సు॒శర్మ॑భిః ॥
పదపాఠము
దేవేభిః । దేవి । అదితే । అరిష్టభర్మన్ । ఆ । గహి । స్మత్ । సూరిభిః । పురుప్రియే । సుశర్మభిః ॥
అర్థము
అనేకులకు ప్రియమైన దివ్యమైన అదితి! అన్ని విపత్తుల నుండి భద్రతను కలిగించే మీరు, మంచి ఆశ్రయం కల్పించే దేవతలతో కలిసి ఇక్కడకు రండి!
ఋగ్వేదం 8.18.5
ఋషి/ద్రష్ట : ఇరిమ్బిఠి కాణ్వ
తే హి పు॒త్రాసో॒ అది॑తేర్వి॒దుర్ద్వేషాం॑సి॒ యోత॑వే । అం॒హోశ్చి॑దురు॒చక్ర॑యోఽనే॒హస॑: ॥
పదపాఠము
తే । హి । పుత్రాసః । అదితేః । విదుః । ద్వేషాంసి । యోతవే । అంహోః । చిత్ । ఉరుచక్రయః । అనేహసః ॥
అర్థము
ఈ అదితి పుత్రులకు శత్రువులను/ఆటంకాలను ఎలా దూరంగా ఉంచాలో తెలుసు-శుద్ధులైన వారికి, పాపం నుండి (మమ్మల్ని) ఎలా విముక్తి చేయాలో తెలుసును.
ఋగ్వేదం 8.18.6
ఋషి/ద్రష్ట : ఇరిమ్బిఠి కాణ్వ
అది॑తిర్నో॒ దివా॑ ప॒శుమది॑తి॒ర్నక్త॒మద్వ॑యాః । అది॑తిః పా॒త్వంహ॑సః స॒దావృ॑ధా ॥
పదపాఠము
అదితిః । నః । దివా । పశుమ్ । అదితిః । నక్తమ్ । అద్వయాః । అదితిః । పాతు । అంహసః । సదావృధా ॥
అర్థము
“అదితి మన సాధనను రక్షిస్తుంది మరియు ద్వంద్వత్వం (నేను వేరు, ఈ ప్రకృతి వేరు అనే భావన) నుండి బయటపడవేస్తుంది . అదితి, తన నిరంతర అనుగ్రహంతో, పాపం నుండి మనల్ని రక్షించి, మనల్ని శక్తివంతం చేస్తుంది.
ఋగ్వేదం 8.18.7
ఋషి/ద్రష్ట : ఇరిమ్బిఠి కాణ్వ
ఉ॒త స్యా నో॒ దివా॑ మ॒తిరది॑తిరూ॒త్యా గ॑మత్ । సా శంతా॑తి॒ మయ॑స్కర॒దప॒ స్రిధ॑: ॥
పదపాఠము
ఉత । స్యా । నః । దివా । మతిః । అదితిః । ఊత్యా । ఆ । గమత్ । సా । శమ్తాతి । మయః । కరత్ । అప । స్రిధః ॥
అర్థము
“అందరినీ పర్యవేక్షించే అదితి మమ్ములను కాపాడాలి; ఆమె మాకు ఆనందాన్ని ఇస్తుంది మరియు (మా) శత్రువులు/తప్పులను దూరం చేస్తుంది.
ఋగ్వేదం 8.47.9
ఋషి/ద్రష్ట : త్రిత ఆప్త్య
అది॑తిర్న ఉరుష్య॒త్వది॑తి॒: శర్మ॑ యచ్ఛతు ।
మా॒తా మి॒త్రస్య॑ రే॒వతో॑ఽర్య॒మ్ణో వరు॑ణస్య చానే॒హసో॑ వ ఊ॒తయ॑: సు॒తయో॑ వ ఊ॒తయ॑: ॥
పదపాఠము
అదితిః । నః । ఉరుష్యతు । అదితిః । శర్మ । యచ్ఛతు । మాతా । మిత్రస్య । రేవతః । అర్యమ్ణః । వరుణస్య । చ । అనేహసః । వః । ఊతయః । సుఊతయః । వః । ఊతయః ॥
అర్థము
“అదితి మనలను రక్షించుగాక, అదితి మాకు ఆనందాన్ని ప్రసాదించుగాక, అద్భుతమైన మిత్ర, ఆర్యమ మరియు వరుణుల తల్లియైన మీ సహాయాలు హాని లేనివి, మీ సహాయాలు నిజమైన సహాయాలు."
ఋగ్వేదం 8.67.10
ఋషి/ద్రష్ట : మత్స్యః సామ్మదొ మాన్యొ
ఉ॒త త్వామ॑దితే మహ్య॒హం దే॒వ్యుప॑ బ్రువే । సు॒మృ॒ళీ॒కామ॒భిష్ట॑యే ॥
పదపాఠము
ఉత । త్వామ్ । అదితే । మహి । అహమ్ । దేవి । ఉప । బ్రువే । సుమృళీకామ్ । అభిష్టయే ॥
అర్థము
"సమృద్ధిగా ఆనందాన్ని ఇచ్చే, గొప్ప దేవత, అదితి, నా కోరిక నెరవేరడం కోసం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను."
ఋగ్వేదం 8.67.11
ఋషి/ద్రష్ట : మత్స్యః సామ్మదొ మాన్యొ
పర్షి॑ దీ॒నే గ॑భీ॒ర ఆఁ ఉగ్ర॑పుత్రే॒ జిఘాం॑సతః । మాకి॑స్తో॒కస్య॑ నో రిషత్ ॥
పదపాఠము
పర్షి । దీనే । గభీరే । ఆ । ఉగ్రపుత్రే । జిఘాంసతః । మాకిః । తోకస్య । నః । రిషత్ ॥
అర్థము
“మీరు అపరిమితమైన హాని నుండి ప్రతి వైపు రక్షిస్తారు; ఓ అదితి, శక్తివంతమైన కుమారులను కలిగి ఉన్న మీరు, శత్రువులు/విధ్వంసకులు మా పిల్లలను బాధపెట్టకుండా చూడండి.
ఋగ్వేదం 8.67.12
ఋషి/ద్రష్ట : మత్స్యః సామ్మదొ మాన్యొ
అ॒నే॒హో న॑ ఉరువ్రజ॒ ఉరూ॑చి॒ వి ప్రస॑ర్తవే । కృ॒ధి తో॒కాయ॑ జీ॒వసే॑ ॥
పదపాఠము
అనేహః । నః । ఉరువ్రజే । ఉరూచి । వి । ప్రసర్తవే । కృధి । తోకాయ । జీవసే ॥
అర్థము
మాకు దోషరహితంగా (ఆశ్రయం) ఇవ్వండి, విస్తృతంగా వ్యాపించిన మీరు (మా కోసం) చాలా దూరం విస్తరించి మా సంతానం నివసించడానికి అనుకూలంగా చేయండి.
ఋగ్వేదం 8.67.14
ఋషి/ద్రష్ట : మత్స్యః సామ్మదొ మాన్యొ
తే న॑ ఆ॒స్నో వృకా॑ణా॒మాది॑త్యాసో ము॒మోచ॑త । స్తే॒నం బ॒ద్ధమి॑వాదితే ॥
పదపాఠము
తే । నః । ఆస్నః । వృకాణామ్ । ఆదిత్యాసః । ముమోచత । స్తేనమ్ । బద్ధమ్ఇవ । అదితే ॥
అర్థము
“ఓ అదితీ, ఓ ఆదిత్యులారా, తోడేళ్ల దవడల/నాశనకారులచే (అనేక బలహీనతలతో) బంధించబడిన దొంగలా ఉన్న మమ్మల్ని విడిపించండి.
ఋగ్వేదం 8.67.18
ఋషి/ద్రష్ట : మత్స్యః సామ్మదొ మాన్యొ
తత్సు నో॒ నవ్యం॒ సన్య॑స॒ ఆది॑త్యా॒ యన్ముమో॑చతి । బ॒న్ధాద్బ॒ద్ధమి॑వాదితే ॥
పదపాఠము
తత్ । సు । నః । నవ్యమ్ । సన్యసే । ఆదిత్యాః । యత్ । ముమోచతి । బన్ధాత్ । బద్ధమ్ఇవ । అదితే ॥
అర్థము
ఓ అదితీ, ఓ ఆదిత్యులారా! బంధించబడిన వ్యక్తి బానిసత్వం నుండి విడిపించబడినపుడు, పాత (మనిషి)కి కొత్త (జీవితం) అవుతుంది.
ఋగ్వేదం 10.72.8
ఋషి/ద్రష్ట : అదితి దాక్షాయణీ
అ॒ష్టౌ పు॒త్రాసో॒ అది॑తే॒ర్యే జా॒తాస్త॒న్వ౧॒॑స్పరి॑ । దే॒వాఁ ఉప॒ ప్రైత్స॒ప్తభి॒: పరా॑ మార్తా॒ణ్డమా॑స్యత్ ॥
పదపాఠము
అష్టౌ । పుత్రాసః । అదితేః । యే । జాతాః । తన్వః । పరి । దేవాన్ । ఉప । ప్ర । ఐత్ । సప్తభిః । పరా । మార్తాణ్డమ్ । ఆస్యత్ ॥
అర్థము
అదితి శరీరం నుండి జన్మించిన కుమారులు ఎనిమిది మంది. చనిపోయిన గుడ్డు నుండి పుట్టుకొచ్చిన ఎనిమిదవ సంతానాన్ని పారవేసి, ఏడుగురితో ఆమె దేవతల దగ్గరకు వెళ్ళింది.
ఋగ్వేదం 10.72.9
ఋషి/ద్రష్ట : అదితి దాక్షాయణీ
స॒ప్తభి॑: పు॒త్రైరది॑తి॒రుప॒ ప్రైత్పూ॒ర్వ్యం యు॒గమ్ । ప్ర॒జాయై॑ మృ॒త్యవే॑ త్వ॒త్పున॑ర్మార్తా॒ణ్డమాభ॑రత్ ॥
పదపాఠము
సప్తభిః । పుత్రైః । అదితిః । ఉప । ప్ర । ఐత్ । పూర్వ్యమ్ । యుగమ్ । ప్రజాయై । మృత్యవే । త్వత్ । పునః । మార్తాణ్డమ్ । ఆ । అభరత్ ॥
అర్థము
ఏడుగురు కుమారులతో అదితి, తన అవ్యక్త స్థితికి వెళ్ళింది. జనన, మరణ వలయంలో ఉండిపోయిన, మార్తాండుని (చనిపోయిన గుడ్డు) కోసం మళ్లీ ఇక్కడకు వచ్చింది.
No comments:
Post a Comment