ఋగ్వేదం 10.109లో చిత్రమైన ప్రయోగం ఋషి జుహూర్ బ్రహ్మజాయా చేసారు. ఈ సూక్తంలో 7 ఋక్కులు ఉన్నాయి. దీని సారాంశం క్రింద వివరించాను.
ఒక సాధకుడు పరబ్రహ్మ పట్ల చేసిన ఒక అపచారం కారణంగా, అతని భార్యను, అద్వైత అనుభూతికి మరోపేరైన "సోమం" తీసుకుని వెళుతుంది. చేసిన అపచారానికి నిష్కృతి చేసిన తరువాత, ఆ సాధకుని భార్యను, దేవతల సాక్షిగా "సోమం" తిరిగి అప్పగిస్తుంది. మానవుల పితృదేవతలైన సప్తఋషులు, ఆ సాధకుని భార్య అతనిని అతి దుర్లభమైన స్థాయికి తీసుకుని వెళుతుంది అని అన్నారు. నిరంతరం బ్రహ్మత్వంలో చరించే ఆ సాధకుడు (బ్రహ్మచారి) దివ్యమైన తేజస్సును పొందాడు.
సంకేతార్థం
నిజానికి ఇందులో భార్య అంటే, సాధనామర్గం అని ఋషి చెప్పారు. ఆ సాధకుడు దారి తప్పడంతో, సాధనామార్గం కోల్పోయాడు. అతను తన తప్పును సరిచేసుకున్న తరువాత, అతని సాధనామర్గం అతనికి తిరిగి లభించి, అతనిని నిరంతరం బ్రహ్మత్వంలో చరించే బ్రహ్మచారిగా మలిచి, అతనికి అత్యున్నతమైన అనుభూతిని ప్రసాదించింది.
---
ఋగ్వేదంలోని ఈ సంకేతార్థం తరువాతతి తరంవారు అర్థం చేసుకున్నట్లు లేదు. అందుకే, తరువాత కాలంలో రచించిన పురాణాలలో, ఈ అంశానికి విపరీత అర్థాలు తీసి, తారా శశాంకుల కథ ఉంచారు.
తార చంద్రుల కథ
పురాణాల ప్రకారం దేవతల పురోహితుడు బృహస్పతి. బృహస్పతి భార్య తార.
తార చంద్రుని చూసి ప్రేమలో పడింది. చంద్రుడు కూడా ఆమెను మోహించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి, కొంతకాలం తర్వాత తార చంద్రునితో వెళ్లిపోయింది. ఆ చంద్రుని వల్ల గర్భం ధరించింది.
ఎవ్వరు చెప్పినా చంద్రుడు తారను వదిలి పెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శతృత్వం మొదలైంది.
రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు, దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువలన శుక్రాచార్యులు రాక్షసవీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తార విషయంగా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది.
తార చక్కటి బంగారు రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది.
ఆ శిశువు దివ్య తేజోవిలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. ఆ బాలుడిని చూసిన తరువాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలూ మునులూ ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు.
బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు. తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది. అపుడు బ్రహ్మ ఆ బాలుడికి “బుధుడు” అని నామకరణంచేసి చంద్రుడికి అప్పగించాడు.
No comments:
Post a Comment