Friday, 14 February 2025

సాధనకు సూనృతం/సుమతి రెండు అవసరమే

 

ఋగ్వేదం 1.3.11


ఋషి: మధుచ్ఛన్దాస్ వైశ్వామిత్ర (ఋషి విశ్వామిత్రుని కుమారుడు)


చోదయిత్రీ సూనృతానాం చేతన్తీ సుమతీనామ్ । యజ్ఞం దధే సరస్వతీ ॥


(దేవి) సరస్వతీ! (మాలో) మంచి ఋతాన్ని ప్రేరేపించి, మంచి బుద్ధిని మేల్కొలిపి, (మా) యజ్ఞం (తపస్సును) స్వీకరించు.


--


మార్గం ఏదైనా, ఆధ్యాత్మిక సాధనలకు అనుసరించవలసిన పద్ధతిని ఋషి చెబుతున్నారు.  


---

1) పునాదిగా, మనలో మంచి ఋతం ప్రేరేపించబడాలి.  ఋతం అంటే పరమ గమ్యమైన సత్యమని, ఇంకా సాధనాక్రమలో త్రికరణశుద్ధితో అనుసరించవలసిన సత్యం పట్ల నిబద్ధతతో కూడిన జీవితం, అని 2 అర్థాలు ఉన్నాయి.  ఇక్కడ రెండవ అర్థం తీసుకోవాలి.


ఐతే, సూనృతం - మంచి ఋతం, అని ఎందుకు చెప్పాలి, ఋతం అంటే సరిపోతుంది కదా, అని సందేహం రావచ్చును.


ఋతం అనేది ఒక సంకల్పం, దిశానిర్దేశం చేసేది.  


దానికి 2 రకాలైన మర్గాలున్నాయి.  ఒకటి సూనృతం - సత్యంతో కూడినది, రెండవది అనృతం - అసత్యంతో కూడినది.

---

సూనృతం అనేది సాధకుడికి మేలు చేస్తూ, అన్ని జీవులకు మేలు చేసేది.


అనృతం అనేది ఆ సాధకుడికి మాత్రం మేలు చేస్తూ, మిగిలిన జీవుల మేలు గురించి ఆలోచించనది.

---

రామాయణమే తీసుకుంటే, అందులో శ్రీహనుమంతుని పునాది సూనృతం, ఇంద్రజిత్తుని పునాది అనృతం.  


సూనృతంతో కూడిన సాధన ఫలించాడానికి  సమయం పడుతుంది, కానీ  శాశ్వతమైన గొప్ప ఫలితాలు ఇస్తుంది.


అనృతంతో కూడిన సాధన ఫలించాడానికి తక్కువ సమయం పడుతుంది,కానీ మిగిలిన జీవులకు మేలు జరిగే అవకాశం తక్కువ కాబట్టి, ఆ సాధకుడు కఠిన నియమాలు పాటించవలసి వస్తుంది. ఆ కఠిన నియమాలు పాటించకపోతే మరణమే సంభవిస్తుంది.


ఇంద్రజిత్తు సామాన్యుడు కాడు.  తపస్సు చేసి, ఎన్నో అస్త్రాలు, శక్తులు సంపాదించాడు.


యుద్ధంలో శ్రీరామ లక్ష్మణులను నేరుగా ఎదుర్కోలేక అదృశ్యమై, వారి మీద ఉండే కోపాన్ని వానరులపై చూపిస్తూ, బ్రహ్మాస్త్రంతో ఒకే రోజున 67కోట్ల మంది వానరులను చంపివేసాడు.


ఐతే, తరువాత శ్రీరామ లక్ష్మణుల అంతం కోరుతు, నికుంభిల దేవి కోసం చేస్తున్న హోమంలో పాటించవలసిన కఠిన నియమం తప్పడంతో, అతనికి మరణమే సంభవించింది.

---

---

2) మంచి బుద్ధి మేల్కొల్పబడడం


సాధకుడు సూనృతం కలిగి ఉంటే సరిపోదు, మంచి బుద్ధిని కలిగి ఉండాలి.  అంటే, అంతర్గత శత్రువులైన కామం, కోపం, అసూయ, మొదలైన వాటిని తొలగించుకోవాలి.  


ఎందుకంటే, ఇవి తపస్సును దారి తప్పిస్తాయి.  ఋషి విశ్వామిత్రుని జీవితమే దీనికి ఒక ఉదాహరణ.

---

కాబట్టి, సూనృతం, సుమతి రెండు ఉండి చేసే సాధన, ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.


అందుకే పరబ్రహ్మ స్వరూపమైన దేవి సరస్వతిని  ఈరకంగా ప్రార్థించమని ఋషి చెబుతున్నారు.


చోదయిత్రీ సూనృతానాం చేతన్తీ సుమతీనామ్ । యజ్ఞం దధే సరస్వతీ ॥



No comments:

Post a Comment