రోజుకు రెండుసార్లు సర్వశక్తులు ఏకీకరించి ధ్యాన/ఆత్మశోధన యజ్ఞం చేయాలని చెప్పే ఋక్కు. కూర్చిన ఋషి వామదేవుడు.
ఋగ్వేదం 4.6.8
ద్విర్యం పఞ్చ జీజనన్త్సంవసానాః స్వసారో అగ్నిం మానుషీషు విక్షు ।
ఉషర్బుధమథర్యో న దన్తం శుక్రం స్వాసం పరశుం న తిగ్మమ్ ॥
మనువును అనుసరించే ప్రజలలో కలిసి జీవిస్తూ ఉండే ఐదుగురు అక్కచెల్లెల్లు, ప్రతి రోజు రెండుసార్లు, అగ్నిని మేల్కొలిపి పెంచడంవల్ల, ప్రాణశక్తి తెల్లవారుజామున మేల్కొంటుంది. ఆ తేజస్సు శిఖ ప్రకాశవంతంగా అందంగా ఉంటుంది మరియు అజ్ఞానాన్ని చేదించే గొడ్డలిలా పనిచేస్తుంది.
---
ప్రపంచంలో ఆత్మజ్ఞానం సాధించినవాడు మనువు అని, ఆ మార్గాన్ని అనుసరించేవారందరు మానవులని సంకేతార్థంలో ఋగ్వేదం చెబుతోంది.
అగ్నిని మేల్కొలపడం అంటే, ధ్యాన/ఆత్మశోధన యజ్ఞం చేయాలనే అర్థం తీసుకోవాలి.
ఐదుగురు అక్కచెల్లెల్లు - పఞ్చ స్వసారో, అనేది ఒక సంకేతార్థం తెలియచేసే చమత్కార ప్రయోగం.
ఋగ్వేదంలో పఞ్చ జనా: (ఐదుగురు ప్రజలు), పఞ్చ జాతా: (ఐదు వర్గాలు), అనే చమత్కార ప్రయోగాలు కనిపిస్తాయి. అలాంటిదే ఈ పఞ్చ స్వసృ (ఐదుగురు అక్కచెల్లెల్లు) అనేది.
---
మన కాలానికి దాదాపు 3,000 సంవత్సరాలకు పూర్వం, ఋగ్వేదానికి వ్యాఖ్యానంగా శౌనకుడు రచించిన బృహద్దేవతలో, పఞ్చ జనా: అంటే మనలో ఉండే చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, మనస్సు, ప్రాణం అని ఆత్మజ్ఞానులు చెబుతారని చెప్పాడు.(శ్రీ అరవిందుల వ్యాఖ్యానం).
చక్షుః శ్రోత్రం మనో వాక్ చ ప్రాణశ్చేత్యాత్మవాదినః ।
---
ఋషి వామదేవుడు, మనలో ఉండే చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, మనస్సు, ప్రాణాలను కూడగట్టుకుని,రోజుకు రెండుసార్లు ధ్యాన/ఆత్మశోధన యజ్ఞం చేయాలని చెబుతున్నారు.
No comments:
Post a Comment