Thursday, 13 February 2025

మంత్రం

ఆధ్యాత్మిక సాధనలో గురువు నుంచి పొందిన మంత్రజపంకానీ, నామజపంకానీ, మరొక ప్రక్రియ ఆధారమవుతుంది.

మననాత్ త్రాయతే ఇతి మన్త్రః - మననం చేసేవారిని రక్షించేది మంత్రం అని పెద్దలు అంటారు.

సరియైన గురువు వద్ద బీజాక్షరాలతో కూడిన మంత్రం పొందగలిగే అదృష్టం అందరికి ఉండకపోవచ్చును. 

ఈనాడు వింటున్న బీజాక్షరాలతో కూడిన మంత్ర శాస్త్రం మొదటనుంచి ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేము.  ఎందుకంటే మంత్రం అనే పద ప్రయోగం ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది.

-----

ఋగ్వేదం నాటి ఋషుల మంత్రం అనే పద ప్రయోగం ఎలా చేసారు అనేది చెప్పడం చాలా కష్టం! ఎందుకంటే వారికి మనకు మధ్యలో చాలా కాలం గడచింది.

ఋషితుల్యులైన శ్రీఅరవిందులు, ఒక ఋగ్వేద ఋక్కులో మంత్రం అనే పదానికి ఆలోచన అని వివరణ  ఇచ్చారు.

ఋగ్వేదం 7.76.4

త ఇద్దేవానాం సధమాద ఆసన్నృతావానః కవయః పూర్వ్యాసః ।

గూళ్హం జ్యోతిః పితరో అన్వవిన్దన్త్సత్యమన్త్రా అజనయన్నుషాసమ్ ॥

"సత్యంతో కూడిన ఆలోచనల ద్వారా దేవతలతో సహవాసం చేసి  మన పూర్వీకులైన ఆ ప్రాచీన ఋషులు, తమలో దాగి ఉన్న కాంతిని కనుగొని, పరమ సత్యాన్ని దర్శించి, జ్ఞానోదయం పొందారు"

-----

బీజాక్షరాలతో కూడిన మంత్రం నియమిత సంఖ్యలో జపం చేసినా, ఒక స్థాయి తరువాత మన ఆలోచనలు, ఆ ఆలోచనలననుసరించి చేసే కర్మలు నిర్మలంగా ఉండకపోతే, ప్రకృతి ఆ మంత్ర జపానికి సరియైన ఫలితం రానివ్వదు.

అంత:కరణశుద్ధి అనేది సత్యంతో కూడిన ఆలోచనలు, కర్మలు చేసినపుడే కలుగుతుంది.

ఋగ్వేద ఋషులు సత్యంతో కూడిన ఆలోచనలు, కర్మలు చేయడంపట్ల అంత దృష్టి పెట్టారు. సాధనా మార్గంపైన కాదు.  త్రికరణశుద్ధితో కూడిన సత్య ప్రవర్తన, సాధకుడికి తగిన సాధనా మార్గాన్ని చూపిస్తుందేమో?

అందువలననేమో సిద్ధి పొందిన గురువులెవరు, తమ వద్దకు వచ్చినవారి అంత:కరణశుద్ధి స్థాయి పరిశీలించకుండా, శిష్యుడిగా స్వీకరించరు.  ఎందుకంటే ఆ సాధకులకు ఒక మార్గాన్ని ఉపదేశించినా, వారిలో  అంత:కరణశుద్ధి లేని కారణంగా పురోగతి ఉండదు.

అంత:కరణశుద్ధి లేకుండా గురువును ఆశ్రయించిన టిబెట్ యోగి "మిలారేపా" జీవితమే ఇందుకు ఒక ఉదాహరణ. "మిలారేపా"లో  అంత:కరణశుద్ధి కలిగిన తరువాతనే,  గురువు ఆయనకు సాధనామార్గాన్ని ఉపదేశించారు.

-----

సత్యంతో కూడిన ఆలోచనలు, తదనుగుణంగా చేసే కర్మలు అంత:కరణశుద్ధిని కలిగిస్తాయి కాబట్టి, ఆ జీవనశైలి కూడా మననమే అవుతుంది కాబట్టి, దానిని మంత్రం అని భావించవచ్చును.

మననాత్ త్రాయతే ఇతి మన్త్రః - మననం చేసేవారిని రక్షించేది మంత్రం

No comments:

Post a Comment