ఋగ్వేదంలో ఇంద్రుడి గురించి శక్తివంతుడిగా, తనను స్తుతించే వారికి ఆటంకాలను కలిగించే వృత్రుడు మొదలైనవారిని సంహరించినవాడిగా, చాలా మార్లు ప్రస్తావన కనబడుతుంది. అన్నింటికి ఆధారమైన పురుషశక్తిగా కొన్నిసార్లు సవితృదేవతను, మరికొన్నిచోట్ల అగ్నిని స్తుతిస్తూ ప్రస్తావన కనబడుతుంది.
ఐతే, ఋగ్వేదమంతట కనిపించే ఒకే పదం ఋతం.
---
అగ్ని, బృహస్పతి, వరుణుడు, మొదలైనవారందరు, ఈ ఋతాన్ని ఆశ్రయించినవారుగానో లేక రక్షించేవారుగానో లేక పెంపొందించేవారుగానో కనిపిస్తారు.
ఆత్మ సాక్షాత్కారము లేక జ్ఞానము లేదా సోమము సిద్ధించడంకూడా ఈ ఋతాన్ని అనుసరించినపుడే లభిస్తున్నట్లు ఋగ్వేదం చెబుతుంది.
ఋగ్వేదం 9.3.3
ఏష దేవో విపన్యుభిః పవమాన ఋతాయుభిః । హరిర్వాజాయ మృజ్యతే ॥
ఈ దేవుడు (సోమము), తనను తాను శుద్ధి చేసుకుంటూ, సత్యాన్ని అనుసరించే వారికి బహుమతిగా అందజేయబడతాడు.
--
చిత్రమేమిటంటే, ఋగ్వేదమంతట ఈ ఋతం అంటే ఏమిటో ఋషులు నేరుగా చెప్పలేదుగానీ, నర్మగర్భంగా మాత్రం చెప్పారు.
క్రింది ఋక్కును గమనించగలరు.
ఋగ్వేదం 7.66.13
ఋతావాన ఋతజాతా ఋతావృధో ఘోరాసో అనృతద్విషః ।
తేషాం వః సుమ్నే సుచ్ఛర్దిష్టమే నరః స్యామ యే చ సూరయః ॥
ఋతాన్ని కలిగి ఉండి, ఋతం నుండి పుట్టి, ఋతాన్ని బలపరిచేవారు, భయంకరులు, అనృతాన్ని (ఋతం కాని దాన్ని) ద్వేషించే వారైన ఆదిత్యుల (వరుణుడు, మిత్రుడు మరియు ఆర్యమాన్), రక్షణలో, పోషణలో, మనుష్యులమైన మేము ఉంటాము.
--
పైన ప్రస్తావించిన ఋక్కులో ఋతజాతా - ఋతం నుండి పుట్టినవారు అనే ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనించగలరు.
ఈ ఋక్కు ఆదిత్యులను ఉద్దేశించి చెప్పినది. ఆదిత్యులంటే అదితి సంతానం.
అదితి - అంటే విభజన లేనిది- అంటే ఆద్యంతాలు లేనిది, దేనికి బంధింపబడనిది, తనను ప్రార్థించినవారి బాధలను తొలగించేది -
నామ, రూపాలు లేని పరబ్రహ్మ స్త్రీ శక్తిగా అనుకోవచ్చును.
అంటే ఋతాన్ని నామ, రూపాలు లేని పరబ్రహ్మ స్త్రీ శక్త్యైన అదితికి పర్యాయపదంగా, నర్మగర్భంగా ఋషులు వాడినట్లు నాకనిపిస్తోంది.
No comments:
Post a Comment