Thursday, 13 February 2025

పితృదేవతలు

 


భారతదేశంలో ప్రజలు గతించిన పెద్దలకు జల తర్పణాలు, పిండప్రదానాలు ఇవ్వడం చూస్తూంటాము.  తండ్రి, తాత, ముత్తాతలకు "పితరులు" అనే శబ్దం వాడటం వారి అధిష్టాన దేవతలైన వసు, రుద్ర, ఆదిత్యులకు చెందుట మరొకటి. ఈ రెండు అర్థాల్లో ఈ పదం వాడబడింది.

పితృదేవతల కార్యం గురించి అందుబాటులో ఉన్న సమాచారం.

  1. పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
  2. కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
  3. ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో రూపంలో అందుతుంది.

----------

తండ్రి మరణవార్తను విన్నతరువాత శ్రీరాముడు జల తర్పణాలు, ఇంగుడి గుజ్జు ముద్దలు సమర్పించిన తరువాత, కౌసల్య అన్నమాటలు.

అతో దుఃఖతరమ్ లోకే న కింఞ్చిత్ప్రతిభాతి మా |

యత్ర రామః పితుర్దద్యాదిఙ్గుదిక్షోదమృద్ధిమాన్ || ౨-౧౦౪-౧౩

"మహారాజు కుమారుడైన రాముడు తన తండ్రికి ఇంగుడి గుజ్జు ముద్దలు సమర్పించడం కంటే భూమిపై నాకు బాధ కలిగించేది ఏదీ నేను భావించడం లేదు."

శ్రుతిస్తు ఖల్వియం సత్య లౌకికీ ప్రతిభాతి మా |

యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః || ౨-౧౦౪-౧౫

"మనిషి తినే ఆహారాన్నే దేవుళ్ళు కూడా స్వీకరిస్తారని అని చెప్పే శృతివాక్యం నిజమేనని నాకు అనిపిస్తుంది."

----

ఐతే ఈ పితృదేవతల కార్యం గురించిన భావనలు మొదటినుంచి పైన చెప్పిన విధంగానే గ్రంథాలలో ఉండేదా అంటే కాదు అనే సమధానం లభిస్తోంది.

అన్నిరకాల ఆధ్యాత్మిక భావనలకు మూలమైన ఋగ్వేదంలో పితృదేవతల గురించి, కేవలం మానవులకు ఆధ్యాత్మికంగా సహాయంచేసే ప్రాచీనఋషులుగా మాత్రం ప్రస్తుతి ఉంది.

అంగీరసులు ఋగ్వేద ఋషులచేతనే ప్రాచీన (సప్త) ఋషులు - పితరో పురాణే - అని కీర్తించబడ్డారు.

-----

వామదేవ ఋషి,  అంగీరసులను మానవుల పితృదేవతలు - పితరో మనుష్యా -  అని అన్నారు.

ఋగ్వేదం 4.1.13

అస్మాకమత్ర పితరో మనుష్యా అభి ప్ర సేదుౠతమాశుషాణాః ।

అశ్మవ్రజాః సుదుఘా వవ్రే అన్తరుదుస్రా ఆజన్నుషసో హువానాః ॥

మన పితృదేవతలు సత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముందుకు సాగారు; వారి గుహను బద్దలుచేసి అందులో దాచిఉంచిన ప్రకాశవంతమైన ఆవులను (సత్యాన్ని) పైకి రప్పించడంతో జ్ఞానం (ఉషస్సు) ప్రకాశించింది.

-----

మానవుల పితృదేవతలు లేదా అంగీరస ఋషుల కథ క్లుప్తంగా ఋగ్వేదంలో ఇలా ఉంటుంది.

 

గోవులను అడ్డుకునే లేదా దొంగిలించే దస్యులను పణీలు (पणयः) అంటారు. వారి అధిపతి వలుడు అనే రాక్షసుడు. వలుడు పర్వతాలలో ఒక గుహలో, రంధ్రం (బిలం)లో నివసిస్తాడు. పణీలు గోవులను దొంగిలించి గుహలోన దాచి ఉంచితే, ఆ ఆవుల జాడను కనుగొనవలసిన బాధ్యత సరమ అనే దేవతల దివ్యమైన దూతపై ఉంటుంది.

ఇంద్రుడు మరియు అంగీరస ఋషులు గోవులను తిరిగి పొందేందుకు సరమ తెలియజేసిన జాడననుసరించి ఆ చీకటి గుహను చేరిన తరువాత, అంగీరస ఋషులు నిజమైన పదం/మంత్రాన్ని జపించాలి. ఇంద్రుడు గుహలోకి ప్రవేశించి కొండపై బలమైన ప్రదేశాలను బద్దలుచేసి తెరిచి, పణీలను ఓడించి, దాచిన సూర్యుని కిరణాలు విడుదల చేయబడి,  గోవుల మందలను/నీటిని పైకి నడపాలి.

ఋగ్వేదం 7.76.4

త ఇద్దేవానాం సధమాద ఆసన్నృతావానః కవయః పూర్వ్యాసః ।

గూళ్హం జ్యోతిః పితరో అన్వవిన్దన్త్సత్యమన్త్రా అజనయన్నుషాసమ్ ॥

ప్రాచీన (సప్త) ఋషులు (అంగీరసులు) దేవతలతో పాటు  దివ్యమైన ఆనందాన్ని(సోమం) పొందారు ; ఆ పితృదేవతలు  సత్యవ్రతంతో కూడిన సూక్తంతో (సత్యమంత్రం), దాగి ఉన్న కాంతిని కనుగొని, దివ్య తేజస్సు (ఉష) ను సాధించారు.

---

శ్రీ అరవింద యోగి ఆధ్యాత్మిక వివరణ.

వృత్రుడు అంతే ఆటంకము అనే అర్థం తీసుకోవచ్చునో, అలాగే వలుడు అంటే బహుశా అన్నింటిని బంధించి ఉంచే మానసిక శక్తిగా , దేవతల దివ్యమైన దూతగా చెప్పబడిన సరమను మనిషిలోని "అంతర దృష్టి"గా అనుకోవచ్చును. పితృదేవతలు లేదా అంగీరస ఋషుల సహాయంతో, ఇంద్రుడు అనే బలమైన ఇంద్రియ శక్తి ఆధారంగా, మనలో ఎక్కడొ (చీకటి గుహలో) దాగి ఉన్న తేజస్సును (గోవు), బయటకు తప్పించడము.

----

ఏడుగురు అంగిరసులను మానవులుగా భావించినా లేక దైవంగా భావించినా, వారు ఋగ్వేదం ప్రకారం, ఏడు తలలు లేదా ఏడు నోళ్ళ స్వరూపంగా వర్ణించబడిన బృహస్పతి యొక్క జ్ఞానానికి ప్రతీకలుగా చెప్పవచ్చును.

ఏడుగురు అంగిరసులు,  జ్ఞానానికి సంబంధించిన విభిన్న సూత్రాలను, ఆలోచనా పదాలను, మరియు స్థాయి విస్తృతిలో ఇవి సార్వత్రిక జ్ఞానంలో సమన్వయంతో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది; మానవులు దేవతల పనితీరును ఉల్లంఘించే దోషం, వంకరత్వం, అసత్యం మరియు వారి ఉనికి, స్పృహ, జ్ఞానం యొక్క విభిన్న సూత్రాలు ఒకదానితో ఒకటి గందరగోళంలోకి ప్రవేశించడం, దైవిక తేజస్సు (ఉష) యొక్క దర్శనం ద్వారా తొలగించబడ్డాయి.

----

ఋగ్వేదం 7.76.5

సమాన ఊర్వే అధి సంగతాసః సం జానతే యతన్తే మిథస్తే

తే దేవానాం మినన్తి వ్రతాన్యమర్ధన్తో వసుభిర్యాదమానాః

 

పితృదేవతలు  స్థాయి విస్తృతిలో  కలిసి పనిచేస్తారు , వారి జ్ఞానాన్ని ఏకం చేస్తారు మరియు వారు తమను తాము వ్యతిరేకించుకోరు; వారు దేవతల పనితీరును తగ్గించరు (పరిమితం చేయరు లేదా బాధించరు), వాటిని ఉల్లంఘించకుండా వారు వసువుల బలం ద్వారా (తమ లక్ష్యానికి) వెళతారు.

------

ఆ ప్రాచీన సప్త ఋషులు/పితృదేవతలు అనబడే అంగీరసులు, ఇప్పటికి మానవుల ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడతారని పెద్దలు చెబుతారు.

---

సదాపృణ ఆత్రేయ ఋషి, సప్త ఋషులవలె సాధన చేయుటకు మరియు అదే దైవిక ఫలితాలను పొందటానికి ఒక ఉపదేశాన్ని మరియు పరస్పర ప్రోత్సాహాన్ని మనుష్యులందరికి అందిస్తున్నారు.

ఋగ్వేదం 5.45.5

ఏతో న్వద్య సుధ్యో భవామ ప్ర దుచ్ఛునా మినవామా వరీయః

ఆరే ద్వేషాంసి సనుతర్దధామాయామ ప్రాఞ్చో యజమానమచ్ఛ

 

ఇప్పుడే రండి, రోజు మనం ఆలోచనలో పరిపూర్ణులం అవుదాం, బాధలను మరియు అశాంతిని నాశనం చేద్దాం, ఉన్నతమైన మంచిని స్వీకరిద్దాం.

No comments:

Post a Comment