శివలింగం ఎలా ఉద్భవించింది అనే కథ శివ పురాణంలోనిది.
(శివ పురాణం - కోటిరుద్ర-సంహితలో 4వ విభాగము 12వ అధ్యాయం)
శివ ధ్యానంలో గడిపే చాలా మంది ఋషులను పరిక్షించడానికి, ఆ ఋషులు ఉన్న దారువనంలోకి, శరీరమంతా బూడిద పూసుకుని తన పురుషాంగం పట్టుకుని, శివుడు ప్రవేశిస్తాడు. ఋషుల భార్యలు మైమరచి శివుని లింగాన్ని పట్టుకోవడానికి చేరుకున్నారు. శివుడిని గుర్తించక, ఆ వికృత కార్యానికి ఋషులు కోపోద్రిక్తులై అతని పురుషాంగము నేలపై పడపోవాలని శపించడంతో, శివుని పురుషాంగం తక్షణమే పడిపోయింది.
ఐతే అది వేగంగా పెరగడం ప్రారంభించి, ముందు ఉన్నదంతా కాల్చివేస్తూంటే, పార్వతి దేవిని ప్రసన్నం చేసుకొని, ఆమెను యోని రూపాన్ని స్వీకరించి, శివుని పురుషాంగం ధరించమని ఆమెను ప్రార్థించమని, బ్రహ్మ ఋషులకు సలహా ఇచ్చాడు. ఋషులు బ్రహ్మ సలహా ప్రకారం పార్వతిని ప్రార్థిస్తే, ఆమె యోని ఆకారాన్ని ధరించి శివుని పురుషాంగం ధరించింది.
----
ఐతే ఈ శివలింగం అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు వేరే అర్థం చెప్పింది.
------
శివలింగం అనేది సంస్కృత పదం. దీని అర్థం 'శివుని చిహ్నం లేదా ప్రాతినిధ్యం'. 'లింగం' అంటే 'చిహ్నం/ ప్రాతినిధ్యం' అని మాత్రమే అర్థం వస్తుంది. అయితే "శిశ్నము" అంటే పురుషాంగం అని అర్థం వస్తుంది.
శివ అంటే పవిత్రమైనది అని పరబ్రహ్మ సంకేతంగా చెప్పారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో పరబ్రహ్మకు ఊహించగల సంకేతం కూడా లేదు అని చెప్పేటప్పుడు లిఙ్గమ్ అనే పదం వాడారు.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.9
న తస్య కశ్చిత్పతిరస్తి లోకే న చేశితా నైవ చ తస్య లిఙ్గమ్।
స కారణం కరణాధిపాధిపో న చాస్య కశ్చిజ్జనితా న చాధిపః॥
అతనికి లోకంలో యజమాని లేడు, పాలకుడు లేడు, లేదా అతనిని ఊహించగల సంకేతం కూడా లేదు. అతడు కారణము, అవయవములకు ప్రభువు; మరియు అతను మూలపురుషుడు లేదా నియంత్రిక లేనివాడు.
----
శివపురాణము (విద్యేశ్వర సంహితలో 1వ విభాగం 7వ అధ్యాయము) ప్రకారము బ్రహ్మ, విష్ణువుల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా, అశరీరుడైన శివుడు వారి మధ్యలో ఒక భారీ అగ్ని స్తంభం యొక్క అద్భుతమైన రూపంగా ప్రత్యక్షమవుతాడు.
విష్ణువు వరాహ రూపాన్ని ధరించి అగ్ని స్తంభం మూలాన్ని వెతకడానికి క్రిందకు వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో అగ్ని స్తంభం పైకి వెతుకుతూ వెళ్ళాడు.
-----
తేజోమయమైన అగ్ని స్తంభం ప్రస్తావన ఋగ్వేదంలో క్లుప్తంగా ఋగ్వేదంలో ఇలా ఉంటుంది.
---
గోవులను/నీటిని అడ్డుకునే లేదా దొంగిలించే దస్యులను పణీలు (पणयः) అంటారు. వారి అధిపతి వలుడు అనే రాక్షసుడు. వలుడు పర్వతాలలో ఒక గుహలో, రంధ్రం (బిలం)లో నివసిస్తాడు. పణీలు గోవులను/నీటిని దొంగిలించి గుహలోన దాచి ఉంచితే, ఆ ఆవుల/నీటి జాడను కనుగొనవలసిన బాధ్యత సరమ అనే దేవతల దివ్యమైన దూతపై ఉంటుంది.
ఇంద్రుడు మరియు అంగీరస ఋషులు గోవులను/నీటిని తిరిగి పొందేందుకు సరమ తెలియజేసిన జాడననుసరించి ఆ చీకటి గుహను చేరిన తరువాత, అంగీరస ఋషులు నిజమైన పదం/మంత్రాన్ని జపించాలి. ఇంద్రుడు గుహలోకి ప్రవేశించి కొండపై బలమైన ప్రదేశాలను బద్దలుచేసి తెరిచి, పణీలను ఓడించి, దాచిన సూర్యుని కిరణాలు విడుదల చేయబడి, గోవుల మందలను/నీటిని పైకి నడుపుతారు.
-------
బయటకు వచ్చిన ఆ తేజస్సు (గోవులు/నీరు) స్వర్గానికి ఒక స్తంభంలా నిలబడిందని తరువాత కథ.
ఋగ్వేదము 5.45.2
వి సూర్యో అమతిం న శ్రియం సాదోర్వాద్గవాం మాతా జానతీ గాత్ ।
ధన్వర్ణసో నద్యః ఖాదోఅర్ణాః స్థూణేవ సుమితా దృంహత ద్యౌః ॥
“సూర్యుడు కొండను విడదీయడం ద్వారా చీకటి గుహలో ఉన్న ప్రకాశవంతమైన గోమాత (ఉషస్సు) వెలికి వచ్చి విస్తరిస్తున్నది. ; దాగి ఉన్న నదులు విశాలంగా ఒడ్డులు ఒరుసుకొని ప్రవహించాయి. ధృఢంగా కట్టిన స్తంభంలా స్వర్గం బాగా స్థిరపడింది “.
----
వృత్రుడు అంతే ఆటంకము అనే అర్థం తీసుకోవచ్చు. అలాగే వలుడు అంటే బహుశా అన్నింటిని బంధించి ఉంచే మానసిక శక్తిగా , దేవతల దివ్యమైన దూతగా చెప్పబడిన సరమను మనిషిలోని "అంతర దృష్టి"గా అనుకోవచ్చును. పితృదేవతలు లేదా అంగీరస ఋషుల సహాయంతో, ఇంద్రుడు అనే బలమైన ఇంద్రియ శక్తి ఆధారంగా, మనలో అజ్ఞానంవల్ల ఎక్కడో (చీకటి గుహలో) దాగి ఉన్న తేజస్సును (గోవు/నీటిని) - మూలాధార చక్రంలో ఉన్న కుండలినీ శక్తి?, బయటకు తప్పించడము.
బయటకు వచ్చిన ఆ తేజస్సు వల్ల, ధృఢంగా కట్టిన స్తంభంలా స్వర్గం బాగా స్థిరపడింది అంటే బహుశ: మూలాధార చక్రంలో ఉన్న కుండలినీ శక్తి కదలి సహస్రారం వరకు వెళ్ళి, జ్ఞానం స్థిరపడడమేమో?
No comments:
Post a Comment