Thursday, 13 February 2025

అగ్ని సాక్షిగా పనులు/ప్రమాణాలు ఎందుకు చేస్తారు?


హిందు సాంప్రదాయంలో చాల పనులు అగ్ని సాక్షి గా చేసినట్లు, సాహిత్యంలో కనిపిస్తుంది.  కొన్ని ఉదాహరణలు.


1) దేవతలకు ఆహుతులు ఇచ్చినపుడు అగ్ని సాక్షిగా, అగ్ని ద్వారా పంపడం

2) ఏదైనా ఒప్పందం జరిగినపుడు అగ్ని సాక్షి గా చేయడం - శ్రీరామ, సుగ్రీవల మధ్య ఒప్పందం

3) నవదంపతుల మధ్య వివాహ ఒప్పందం అగ్ని సాక్షిగానే జరుగుతుంది.

4) ఏదైనా ప్రమాణం చేసేటప్పుడు అగ్ని/భగవంతుని సాక్షిగా చేయడం 

ఐతే ,

1) ఏదైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం నీటిని వదులుతు దానం ఇస్తారు.

2) గురువు శిష్యుడికి ఉపదేశం ఇచ్చే ముందు, శుచిగా అవడం కోసం నీటినే వాడతారు.

---

ఈ సాంప్రదాయాలు క్రొత్తవి కావు.  రామాయణ, భారతాల కాలం నుంచి కనిపిస్తాయి.

వేద సాంప్రదాయలో కూడా దేవతలకు ఆహుతులు ఇచ్చినపుడు అగ్ని సాక్షిగా, అగ్ని ద్వారా పంపడం కనిపిస్తుంది.

---

ఎందుకు ప్రారంభించారు అని ఆలోచిస్తే మాత్రం, అగ్ని/నీరు పంచభూతాలలో భాగం కాబట్టి అని చదివాను.

నాకు అర్థమైనంతవరకు, సనాతనధర్మ సాంప్రదాయంలో చాలా పనులు అగ్ని సాక్షి గా చేయడానికి, మూలం ఋగ్వేదంలో కనిపిస్తుంది.

దేవతలకు హవ్యం అగ్ని ద్వారానే అందుతుంది అనే ఆలోచన యజుర్వేదంలోనిది.  ఎందుకంటే అందులో భౌతికంగా యజ్ఞం చేయడం కనబడుతుంది.    

ఋగ్వేదంలో యజ్ఞ ప్రస్తావన కనిపించినా, అది మానసిక యజ్ఞం లేదా ధ్యానం మొదలైన కార్యాలను నర్మగర్భంగ సూచిస్తుంది అని శ్రీ అరవింద యోగి వంటివారు చెప్పారు.

---
 
ఋగ్వేదం రెండవ మండలంలో 1వ సూక్తం అగ్నిని స్తుతిస్తుంది.  ఇందులో 16 ఋక్కులు ఉన్నాయి.

చిత్రమేమంటే, తరువాతి కాలంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను అన్ని జీవులలో ఉన్నాను (10వ అధ్యాయం) అని చెప్పడానికి, ఉపనిషత్తులలో సర్వం బ్రహ్మమయం అని చెప్పడానికి పునాది మాత్రం, ఈ సూక్తంలో ఉంది.

అద్వైతానికి మూలం కూడా ఇదే!

ఇందులో అగ్ని జలంలోను, శిలలోను, వృక్షాలలోను, మానవులలోను ఉన్నాడని ఉంది.

త్వమగ్నే ద్యుభిస్త్వమాశుశుక్షణిస్త్వమద్భ్యస్త్వమశ్మనస్పరి । 
త్వం వనేభ్యస్త్వమోషధీభ్యస్త్వం నృణాం నృపతే జాయసే శుచిః ॥

అగ్నిని బ్రహ్మమని , సత్యమని,  అగ్నియే ఇంద్రుడని, విష్ణువని, వరుణుడని, సవితృ అని,  రుద్రుడు, అదితి, సరస్వతి, మొదలైన అన్ని పరబ్రహ్మ రూపాలని ఉంది.

---

పంచభూతాలు అగ్నియే అవడం వల్ల, అన్ని జీవ, నిర్జీవ పదార్థాలలో అగ్ని ఉండడం వల్ల,
అగ్నిని బ్రహ్మమని గ్రహించడం వల్ల, అగ్ని సాక్షి గా చేయడమంటే ఆ భగవంతుడి సాక్షిగా చేయడం అని ఆనాటి ఋషులు గ్రహించడం వల్ల, అగ్ని సాక్షి గా పనులు/ప్రమాణాలు చేయడమనే సాంప్రదాయం ప్రారంభించి ఉండాలి.


No comments:

Post a Comment