Friday, 14 February 2025

సరస్వతి/సరస్వతుల అర్థనారీశ్వర తత్వం

 

 ఋగ్వేదం 7వ మండలం ప్రధానంగా ఋషి వశిష్టుడు, అతని వంశమువారు/శిష్యులు కూర్చినది.  అందులో ఒక చిత్రమైన ప్రయోగం గమనించాను.


7వ మండలంలోని 96వ సూక్తంలో 6 ఋక్కులు ఉన్నాయి.  మొదటి మూడు సరస్వతిని ఉద్దేశించి, మిగిలిన మూడు సరస్వతుడిని ఉద్దేశించి, కూర్చినవి.


ఈ సరస్వతుడెవరో ఋగ్వేదంలో స్పష్టంగా చెప్పలేదు.  ఎవరి అనుభవం దృష్ట్యా వారు అర్థం చేసుకోవలసినదే!


నేరుగా కనిపించే అర్థం ఒకలా ఉంటుంది, మరి సంకేతార్థం ఇంకోలా ఉంటుంది. నేను సంకేతార్థం మాత్రమే ఇస్తున్నాను.

---

ఋగ్వేదం 7.96.6


పీపివాంసం సరస్వతః స్తనం యో విశ్వదర్శతః । భక్షీమహి ప్రజామిషమ్ ॥


సరస్వంతుని స్తనం నుండి పొంగిపొర్లుతున్న (మధురమైన జ్ఞానధరలను త్రాగి) మేము ఆనందము అనుభవిస్తున్నాము. (ఇది) అందరు చూడగలరు.

---

ఇక్కడ సరస్వంతుని స్తనం నుండి - సరస్వతః స్తనం, అనేది ఋషి వశిష్టుని చిత్రమైన ప్రయోగం.


పరబ్రహ్మను తల్లిగా భావిస్తే, తల్లి స్తనం నుండి అనే ప్రయోగాన్ని అర్థంచేసుకోవచ్చును, కాని ఇక్కడ ఋషి వశిష్టుడు, పురుష నామమైన సరస్వంతుని స్తనం నుండి అనే ప్రయోగం చేసారు.

---

 ఋషి వశిష్టుని చిత్రమైన ప్రయోగం గురించి నాకు అర్థమైన విషయం మీతో పంచుకుంటున్నాను.


పరబ్రహ్మ తత్వాన్ని మహనీయులు ధ్యానంలో చైతన్య స్వరూపంగా దర్శించారు.  ఆ చైతన్యంలో స్త్రీ, పురుష శక్తులు మిళితమై ఉంటాయని  ఋషులు దర్శించారు. 


ధ్యానంలో అనుభవమైన చైతన్యస్వరూప దర్శనాన్ని, అక్షరరూపంలో చెప్పడం దాదాపు అసాధ్యం.  ఐతే, ఋగ్వేద ఋషులు చేసిన ప్రయత్నంతో, దానిని అదితి, అగ్ని సమ్మేళనంగా సంకేతార్థంలో చెప్పారు.


తరువాతి కాలంలో అదే శివ పార్వతుల అర్థనారీశ్వర తత్వంగా ప్రచారంలోకి వచ్చింది.

 

 

అర్థనారీశ్వర తత్వం ఒక చిత్రపటంగా వేస్తే లేక ఒక శిల్పంగా మలిస్తే, అందులో కుడి వైపున సగభాగం పురుష శరీరం, ఎడమవైపు సగభాగం స్రీ శరీరం కనిపిస్తుంది.


ఆ చిత్రపటం లేక శిల్పంలో, స్రీ శరీర భాగంలో స్తనం కనిపిస్తుంది.

--

ఋగ్వేదం 7వ మండలంలోని 96వ సూక్తంలో 6 ఋక్కులు ఉన్నాయి.  మొదటి మూడు సరస్వతిని ఉద్దేశించి, మిగిలిన మూడు సరస్వతుడిని ఉద్దేశించి, కూర్చినవి.


పైన చెప్పిన ఋగ్వేద ఋక్కులో ఋషి వశిష్టుడు అటువంటి దర్శనాన్నే సరస్వతి, సరస్వతుల సంగమంగా చెప్పినట్లు నాకు తోస్తోంది.


పరబ్రహ్మను సరస్వతి, సరస్వతుల సంగమంగ భావిస్తే, "రస్వతుని స్తనం నుండి పొంగిపొర్లుతున్న (మధురమైన జ్ఞానధరలను త్రాగి) మేము ఆనందము అనుభవిస్తున్నాము"  అనే ఋషి వశిష్టుని ప్రయోగాన్ని అర్థంచేసుకోవచ్చును.


అంటే 6వ ఋక్కులో సరస్వతుడిని స్తుతిస్తున్నా, సరస్వతి సరస్వతుల సంగమంలో, సరస్వతి కూడా ఉంది కద!  సరస్వతి ఉన్న వైపు నుండి మధురమైన జ్ఞానధరలను త్రాగినట్లు అర్థం చేసుకోవాలనిపిస్తోంది.

No comments:

Post a Comment