ఋగ్వేదం 3వ మండలం 62వ సూక్తంలో, ఈనాడు గాయత్రీ/సావిత్రీ మంత్రంగా పిలువబడే ఋక్కు 10వ ఋక్కుగా ఉంది ఈ సవిత మంత్రము.
తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||
ఐతే ఈ ఋక్కులో ఓంకారము, వ్యాహృతులు ఉండవు.
భూర్భువస్వః లోని భూః, భువః, స్వః అనేవి వ్యాహృతులు.
------
ఓంకారము, వ్యాహృతులతో కూడిన ఈ సవిత మంత్రము తైత్తరీయ అరణ్యకములో (10.35.1) కనిపిస్తుంది .
ఓం భూర్భువస్వః | తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||
----
యజుర్వేదంలో 36వ అధ్యాయం 3వ మంత్రంలో ఈ సవిత మంత్రము ఉంది. ఐతే ఇందులో ఓంకారము ఉండదు, కానీ వ్యాహృతులు ఉంటాయి.
భూర్భువస్వః | తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||
-------
గాయత్రి మంత్ర అధిదేవత అనగానే ఒక స్త్రీరూపం చూపిస్తున్నారు.
చాందోగ్యం అనే ఉపనిషత్తు (1.6.6) సూర్య మండలానికి మధ్యన ఎవరు ఉన్నారు అని ప్రశ్నవేసుకొని సమాధానంగా యయేశో అంతరాదిత్యే హిరణ్మయ పురుషః అని అంటుంది.
సూర్యగోళపు మధ్యన ఉండే ఆయన, పాదాలనుండి కేశాల వరకు ప్రకాశవంతమైన రూపం కల పురుషుడు అని చెబుతుంది.
గాయత్రి మంత్ర అర్థం సూర్యమండలం మధ్యలో ఉండి తేజస్సుకు కారణమేదో అది నాలో ఉండే బుద్దిని కూడా ప్రేరేపించి నన్నూ మంచి మార్గంలో నడుపుగాక.
అది పురుషుడిని చెబుతుంది కనక 'యహ' అని ఆ మంత్రంలో ఉంటుంది. స్త్రీ రూపం దాని అర్థం కాదు.
--------
ఋగ్వేదంలో అగ్నియే ఇంద్రుడు, విష్ణువు, సత్యానికి అధిపతియైన వరుణ, మిత్ర, అర్యమ, భగ, అదితి, భారతీ, సరస్వతి, అగ్నియే సర్వము అని ఉంది. అగ్నియే అన్నింటికి మూలమైన సవితృ శక్తి అని ఋగ్వేదం చెబుతోంది.
సవితృ నుంచి వచ్చినది కాబట్టి సావిత్రి అంటారు.
సవితృ శక్తికి సంబంధించిన ఋక్కులు త్రిష్టుప్, జగతీ, గాయత్రీ, మొదలైన చందస్సులలో కనిపిస్తాయి.
-------
శతపథ బ్రాహ్మణం 11.5.4.1 – 11.5.4.13 లలో గురువు ఒక నూతన విద్యార్థికి ఏ విధంగా విద్య నేర్పిస్తాడో ఉంది.
ముందుగ విద్యార్థికి ఇంద్ర, అగ్ని, ప్రజాపతి, సవితృలను స్మరింపజేసి, జలము, వృక్షములు, భూమి ఆకాశము, అన్ని జీవుల సాక్షిగ, సావిత్రి మంత్రము వినిపిస్తారు.
గురువు శిష్యుడికి అనుష్టుప్ చంధస్సులో ఉన్న సావిత్రి చెప్పరాదని, గాయత్రీ చంధస్సులో ఉన్న సావిత్రి చెప్పాలని శతపథ బ్రాహ్మణం 11.5.4.13లో ఉంది. ఐతే ఋగ్వేదంలో సవితృకు సంబంధించిన, గాయత్రీ చంధస్సులో ఉన్న, ఏ ఋక్కు గురించి అని చెప్పలేదు.
--------
ఋగ్వేదంలో గాయత్రీ చంధస్సులో ఉన్న సవితృకు సంబంధించిన ఋక్కులు, విశ్వామిత్ర మహర్షి దర్శించిన ఋక్కు (తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||) మాత్రమే కాక, అత్రి మహర్షి దర్శించిన ఋక్కులు (5.82.2 నుంచి 5.82.9 వరకు) కూడా ఉన్నాయి.
విశ్వామిత్ర మహర్షి దర్శించిన ఋక్కు (తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||) మాత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది.
----------
మనుస్మృతి 2.78 ప్రకారం, ప్రణవము, వ్యాహృతులతో కూడిన ఈ సావిత్రీ మంత్రాన్ని ద్విజులు 2 సంధ్యాకాలాలలో జపించాలి.
మరి ప్రణవము, వ్యాహృతులతో కూడిన ఈ సావిత్రీ మంత్రాన్ని ద్విజులు రోజుకు 3 మార్లు ప్రణవము జపించాలి, అనే నియమం ఎలా వచ్చిందో తెలియడం లేదు.
-------
గాయత్రీ మంత్రం విశ్వామిత్రుడు దర్శించినదే.
ఐతే ఋగ్వేదంలో ఈ మంత్రము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే అని లేదు.
No comments:
Post a Comment