త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక.
--
1) "అంబ" అంటే తల్లి అన్న అర్థం వస్తుంది కానీ, కన్ను అనే అర్థం రాదు. నేత్రము, నయనము, చక్షువు అనే పదాలకు కన్ను అనే అర్థం వస్తుంది. కాబట్టి ముగ్గురు తల్లులు కలిగిన అనే అర్థం వస్తుంది కానీ, మూడు కన్నులు కలిగిన రుద్రుడు అనే అర్థం రాదు.
ముగ్గురు తల్లులు కలిగిన రుద్రుడు అనే అర్థం తీసుకోవచ్చును కానీ, ఇంద్రుడు/విష్ణువు/అదితి మొదలైన అనేక నామాలతో పరబ్రహ్మగా కీర్తించబడిన అగ్నియే రుద్రుడు అని కూడా ఋగ్వేదం 2.1 కీర్తించింది. కాబట్టి పరబ్రహ్మైన రుద్రుడికి ముగ్గురు తల్లులు ఎక్కడున్నారు అనే ప్రశ్న వస్తుంది.
ఈ ఋక్కు రుద్రుని ఉద్దేశించినా, అది సంకేతంగా తీసుకోవాలని, ఇది ఒక ఆధ్యాత్మిక సాధకుని పరంగా మాత్రమే చెప్పినట్లు నాకనిపిస్తోంది.
2) ఒక ఆధ్యాత్మిక సాధకుని పరంగా తీసుకుంటే, అందరు సాధకులకు ముగ్గురు తల్లులు ఉండాలి కద! ఆ ముగ్గురు తల్లులు ఎవరు అనే ప్రశ్న వస్తుంది!
ఋగ్వేదంలో మూడు స్త్రీ శక్తులను కలిపి ప్రస్తావించడం చూడవచ్చును. వారే సరస్వతి, ఇళ, భారతి.
ఋగ్వేదం 2.3.8
సరస్వతీ సాధయన్తీ ధియం న ఇళా దేవీ భారతీ విశ్వతూర్తిః ।
తిస్రో దేవీః స్వధయా బర్హిరేదమచ్ఛిద్రం పాన్తు శరణం నిషద్య ॥
తల్లులందరిలో, దేవీమూర్తులలో, దివ్యశక్తులలో సరస్వతిని అధికురాలిగా ఋగ్వేదం 2.41.16 చెబుతుంది.
అమ్బితమే నదీతమే దేవితమే సరస్వతి ।
అప్రశస్తా ఇవ స్మసి ప్రశస్తిమమ్బ నస్కృధి ॥
ఇక్కడ కూడా తల్లిని "అంబ" (అమ్బితమే) అనడం చూడవచ్చును.
--> సరస్వతి, ఇళ, భారతిల అనుగ్రహం కలిగితే, వారి సమ్మిళిత, పరబ్రహ్మ స్త్రీ శక్తైన అదితి అనుగ్రహం కలిగినట్లే.
3) సుగంధిం పుష్టి వర్ధనం అంటే "సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే" అనే అర్థం తీసుకోవడం సరికాదు అనిపిస్తోంది. ఎందుకంటే తరువాతి పంక్తిలో వచ్చే, "మృత్యువు నుంచి వేరుచేసి అమృత సమానమైన మోక్షము నుండి విడివడకుండ ఉండడం" అనే విషయానికి, రుద్రుడు సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసేవాడై ఉండడం అనే విషయం ఏరకంగాను కలువదుకద!
గంధం అంటే "సంబంధం" (relationship) అనే ఇంకొక అర్థం ఉంది. సుగంధిం అంటే "మంచి సంబంధం" అనే అర్థం వస్తుంది.
సుగంధిం పుష్టి వర్ధనం అంటే "మంచి సంబంధం కలిగి, దానిని వృద్ధి చేయుట" అనే అర్థం తీసుకోవచ్చును.
4) ఇప్పుడు అన్ని విషయాలను కలిపి గమనిస్తే, ఒక ఆధ్యాత్మిక సాధకుడు రుద్రుని చేసే ప్రార్థనను చూడవచ్చును.
ముగ్గురు తల్లులతో (సరస్వతి, ఇళ, భారతి అనే మూడు స్త్రీ శక్తుల) సంబంధం ఏర్పడి (అనుగ్రహం కలిగి), ఆ సంబంధం మరింత వృద్ధి చెందేటట్లు చేయమని రుద్రుని ప్రార్థిస్తున్నాను. తద్వారా తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక.
--
మరొక్క విషయమేమిటంటే ఋగ్వేదం 3.29.3లో పరబ్రహ్మైన అగ్నిని కూడా, మూడు స్త్రీ శక్తుల ఒకరైన "ఇళా పుత్రుడిగా" (.....అరుషస్తూపో రుశదస్య పాజ ఇళాయాస్పుత్రో...) సంబోధించడం గమనించవచ్చును.
కాబట్టి, ముగ్గురు తల్లుల పుత్రుడిగా రుద్రుని సంబోధించినా, "ఇళా పుత్రుడిగా" అగ్నిని సంబోధించినా, దానిని ఒక ఆధ్యాత్మిక సాధకుని పరంగా చెప్పినట్లు మాత్రమే స్వీకరించాలని నాకనిపిస్తోంది.
No comments:
Post a Comment