Showing posts with label S.014 - నామ జపం. Show all posts
Showing posts with label S.014 - నామ జపం. Show all posts

Monday, 23 March 2026

నామ జపం

కలి యుగంలో, ముక్తికి నామ జపానికి మించినదేది లేదని పెద్దలు చెబుతూంటారు.  ఐతే, నామ జపం ప్రాముఖ్యత గురించి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తే, దొరికిన సమాధానమిది.

*పురాణాలు*

నారద పురాణము(1.1.41.115)లో సనక ఋషి నారదునితో అన్న మాటలు.

హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనమ్

కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా

నా జీవితమంతా హరి నామము తప్ప ఇంకొకటి లేదు.  కలి యుగంలో హరినామమే ముక్తిని ప్రసాదించగలదు.

----

పురాణాలకన్న ముందు, రామాయణంలో *రామనామ జపం* సీత చేసినట్లుగా, సుందరకాండలో ఉంది.

శ్రీహనుమంతుడు శింశుపా వృక్షంపైనుండి శ్రీరామ కథను వినిపించినపుడు సీత మనోగతం.

రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచిన్త్యా వాచా బ్రువతీ తమేవ |

తస్యానురూపం కథాం తదర్థా మేవం ప్రపశ్యామి తథా శృణోమి || 5-32-11

"నేను రాముని గురించి మాత్రమే మనస్సుతో ఆలోచిస్తున్నాను, మరియు ఎల్లప్పుడూ 'రామా! రామ!'అని అంటున్నాను. అందువల్ల, అతని ఆలోచనకు అనుగుణంగా నేను ఒక కథను చూస్తున్నాను మరియు వింటున్నాను."

---

ఐతే, ఋగ్వేదంలో (1.24.2) కూడా నామజపం ప్రాముఖ్యత గురించి, శునశేప ఆజీగర్తి ఋషి ప్రస్తావించారు.

ఇక్కడ *అగ్ని* అంటే పరబ్రహ్మం అని అర్థం చేసుకోవాలి.

 

అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం *మనామహే* *చారు* దేవస్య నామ  

నో మహ్యా అదితయే పునర్దాత్పితరం దృశేయం మాతరం

అమృతత్వం కలిగిన వారిలో మొదటివాడైన (ప్రథమస్యామృతానాం) అగ్నిదేవునియొక్క (దేవస్య) సుందరమైన (చారు) నామాన్ని, నిరంతరం తదేకదీక్షతో మనమందరము చేద్దాము (*మనామహే* వయం).  అప్పుడు, అగ్ని నన్ను, (దేవమాతైన) అదితి మరల చేరుస్తాడు (మహ్యా అదితయే పునర్దాత్). అందువలన, తల్లిదండ్రుల దర్శనం (పితరం దృశేయం మాతరం ) అవుతుంది.

---

తల్లిదండ్రుల దర్శనం అవడమంటే, అర్థనారీశ్వరతత్వం అనుభవంలోకి వస్తుందని, అంటే స్త్రీపురుష తత్వాలకు అతీతమైన ఆత్మసాక్షాత్కారం అవుతుందని,  అర్థం చేసుకోవచ్చును.